ఈ ఎన్నికల్లో ఓడితే మళ్ళీ పోటీ చేయను : డొనాల్డ్​ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ అమెరికా మాజీ ప్రెసిడెంట్,​ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో కనుక తాను ఓడిపోతే, భవిష్యత్తులో మళ్లీ పోటీ చేయబోనని ట్రంప్ ప్రకటించారు.

Update: 2024-09-23 09:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ అమెరికా మాజీ ప్రెసిడెంట్,​ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో కనుక తాను ఓడిపోతే, భవిష్యత్తులో మళ్లీ పోటీ చేయబోనని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ఓ ఇంటర్య్వూలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌ 5న జరగబోయే ఎన్నికల్లో తాను ఓడిపోతే, ఇక మళ్లీ పోటీ చేయబోనని ప్రకటించారు. ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో తాను కచ్చితంగా విజయం సాధిస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు."మేం ఈసారి ఓడిపోతామని అస్సలు అనుకోవడం లేదన్నారు. మేము తప్పకుండా విజయం సాధిస్తామని, ఒకవేళ మేం ఓడిపోతే, 2028 ఎన్నికల్లో నేను బరిలోకి దిగనన్నారు.

అధ్యక్షఎన్నికల్లో నేను విజయం సాధిస్తే, దాని వెనుక ముగ్గురి కీలక పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. కెన్నడీ జూనియర్, ఎలాన్ మస్క్, తులసి గబ్బార్డ్‌కు చాలా విషయాలపై అవగాహన ఉందని, వారు నా బృందంలో ఆరోగ్యం, పర్యావరణంపై కెన్నడీ, దేశంలోని చెత్తను తొలగించడంలో మస్క్‌ కీలక పాత్ర పోషిస్తారని, పరిపాలనలో తులసి గబ్బార్డ్​కు అనుభవం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. మేం అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే ఇంధనం ధరలను 50% వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని.. ఇది వ్యాపారులకు కూడా బాగా ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. 78 ఏళ్ల ట్రంప్‌ ఇప్పటికే ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు 48%, ట్రంప్‌నకు 40% మంది మద్దతు ఉందని సర్వే సంస్థలు తేల్చడంతో..స్వల్ప తేడా నేపథ్యంలో ఈ సారి అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. 


Similar News