మిస్‌ యూనివర్స్‌ ఇండియా విజేత గుజరాత్‌ బ్యూటీ రియా సింఘా

మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేతగా గుజరాత్‌ బ్యూటీ రియా సింఘా ఎంపికైంది. ఈ ఏడాది మెక్సికోలో జరిగే ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారత్‌ తరఫున రియా సింఘా పోటీ పడనుంది.

Update: 2024-09-23 11:39 GMT

దిశ, వెబ్ డెస్క్ : మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేతగా గుజరాత్‌ బ్యూటీ రియా సింఘా ఎంపికైంది. ఈ ఏడాది మెక్సికోలో జరిగే ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారత్‌ తరఫున రియా సింఘా పోటీ పడనుంది. రాజస్థా్‌న్‌లోని జైపూర్‌ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 పోటీల్లో 51 మంది సుందరీమణులు పోటీపడ్డారు. చివరకు గుజరాత్ భామ రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని సాధించింది. ఈ పోటీలకు 2015లో మిస్‌ యూనివర్స్‌ ఇండియా ఊర్వశీ రౌతేలా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. విజేతకు తాజ్ మహల్ కిరీటాన్ని అలంకరించారు. "ఈ సంవత్సరం భారతదేశం తప్పకుండా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంటుంది" అని రౌతేలా ఆశాభావం వ్యక్తం చేశారు. పోటీ ఫలితం ప్రకటించిన తర్వాత రియా భావోద్వేగానికి లోనైంది. "ఈ రోజు నేను మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకున్నాను, నేను చాలా కృతజ్ఞురాలిని. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డానని పేర్కొంది. తాను మునుపటి విజేతల నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని చెప్పుకొచ్చింది. పోటీల్లో 1వ రన్నరప్‌గా  ప్రాంజల్ ప్రియ, 2వ రన్నరప్ గా ఛవీ వెర్గ్ నిలిచారు. సుస్మితా రాయ్ 3వ రన్నరప్‌గా, రూప్‌ఫుజానో విసో 4వ స్థానంలో నిలిచింది.

19 సంవత్సరాల రియా సింఘా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు.  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రియాకు ఇన్ స్టాలో 43వేల మందికిపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ స్టోర్‌ ఫ్యాక్టరీ డైరెక్టర్‌, వ్యవస్థాపకుడైన బ్రిజేష్‌ సింఘా, రిటా దంపతుల కూతురే రియా సింఘా. బీఎల్‌ఎస్‌ యూనివర్సిటీలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో డిగ్రీ చదువుతున్నారు. రియా 16 సంవత్సరాల వయసులో మోడలింగ్‌ ప్రారంభించింది. 2020లో దివాస్‌ మిస్‌ టీన్‌ గుజరాత్‌ టైటిల్‌ని నెగ్గింది. 2023 ఫిబ్రవరి 28న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2023లో రియా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. 26 మందితో పోటీపడి టాప్‌-6లో నిలిచింది. 2023 ఏప్రిల్ 19న ముంబయి వేదికగా జరిగిన టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 14లో రియా సింఘా పాల్గొని.. 19 మందితో పోటీపడి రన్నరప్‌గా నిలిచింది. ఇక ఆదివారం జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేత కిరీటాన్ని సొంతం చేసుకున్నది. రియా ఫైనల్లో షాంపైన్ గోల్డ్ గౌనులో పుత్తడి బొమ్మలా ధగధగ మెరిసిపోయింది. అందుకు తగ్గట్టు చెవులకు ధరించిన డైమండ్ రింగులు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.


Similar News