Shivakumar: మోడీ చెప్పేవన్నీ అబద్దాలే.. ప్రధాని ఏటీఎం వ్యాఖ్యలపై డీకే శివకుమార్ ఫైర్
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఆ పార్టీ ఎటీఎంలుగా వాడుకుంటుందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై డీకే శివకుమార్ స్పందించారు.
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఆ పార్టీ ఎటీఎంలుగా వాడుకుంటుందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Dk Shivakumar) స్పందించారు. మోడీ చెప్పేవన్నీ అబద్దాలేనని కొట్టి పారేశారు. ప్రధానిని ఎవరో తప్పదారి పట్టించారని తెలిపారు. సోమవారం ఆయన బెంగళూరు (Bengalur)లో మీడియాతో మాట్లాడారు. మోడీ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే సీఎం సిద్ధరామయ్య (cm Siddaramaiah) ఇప్పటికే రాజీనామా చేస్తానని ప్రకటించారని, తాను కూడా అదే మాటకు కట్టుబడి ఉంటానని సవాల్ విసిరారు. అంతేగాక రాజకీయాల నుంచి సైతం తప్పుకుంటానని చెప్పారు. అలాగే ఎక్సైజ్ శాఖలో రూ.700 కోట్లు వసూలు చేశారని ప్రధాని చేసిన వ్యాఖ్యలపైనా శివకుమార్ స్పందించారు. అవి నిరాధార ఆరోపణలని తెలిపారు. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆ రాష్ట్రం రాజకుటుంబానికి ఏటీఎంలా మారుతోంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక. తెలంగాణలు వారికి ఏటీఎంలుగా మారాయి’ అని విమర్శించారు. దీంతో ఈ వ్యాఖ్యలకు శివకుమార్ కౌంటర్ ఇచ్చారు.