Supreme Court: తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్న నెయ్యిని వాడారనే వార్త దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్న నెయ్యిని వాడారనే వార్త దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. స్వయంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) చూపించిన ల్యాబ్ రిపోర్ట్స్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడి తిరుమల (Tirumala) లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతటి దురాగతానికి పాల్పడిన భాధ్యులను కఠినంగా శిక్షించాలని సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు సోషల్ మీడియా (Social Media) వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహరంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వెంటనే విచారణ జరపాలంటూ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి (Subramanya Swamy) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నట్లుగా తెలిపారు. విషయాన్ని కోర్టు దృష్టి తీసుకెళ్తే నిజానిజాలు అవే బయటకు వస్తాయని సుబ్రమణ్యస్వామి అన్నారు. కాగా, తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదంపై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం 2.15కు విచారణ చేపట్టనుంది.