మహారాష్ట్ర స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..

Update: 2023-10-13 12:33 GMT

న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలపై శివసేన (ఉద్ధవ్) దాఖలు చేసిన అనర్హత పిటిషన్లకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలో ఎందుకు జాప్యం చేస్తున్నారని స్పీకర్‌ను నిలదీసింది. నిర్ణీత షెడ్యూల్‌ను నిర్ణయించి ఆలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో స్పీకర్ విఫలమైతే.. తామే ఒక గడువు తేదీని నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రెండు నెలల్లోగా మొత్తం విచారణ ప్రక్రియను పూర్తి చేసి, ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించాల్సి వస్తుందని తెలిపింది.

“మేము ఈ కోర్టు గౌరవాన్ని కాపాడుకోవడం గురించి ఆందోళన చెందుతున్నాం. మా ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందే’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘‘వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోగా అనర్హత పిటిషన్ల వ్యవహారంపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మొత్తం ప్రక్రియ అసంపూర్తిగా మిగిలిపోతుంది’’ అని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసుపై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అవిభాజ్య శివసేన పార్టీకి చెందిన చీఫ్ విప్ హోదాలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభు గత ఏడాది షిండేతో పాటు మరో 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్లు దాఖలు చేశారు.


Similar News