ఈడీ డైరెక్టర్‌ పదవీకాలం పొడగింపునకు సుప్రీంకోర్టు అనుమతి

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్‌గా సంజ‌య్ కుమార్‌ మిశ్రాను సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు కొన‌సాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

Update: 2023-07-27 12:15 GMT

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్‌గా సంజ‌య్ కుమార్‌ మిశ్రాను సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు కొన‌సాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆ త‌ర్వాత పొడిగింపు ఇవ్వలేమని జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, విక్రమ్‌నాథ్‌, సంజ‌య్ క‌రోల్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం గురువారం స్పష్టం చేసింది. సంజ‌య్ కుమార్‌ మిశ్రా పదవీ కాలం జులై 31తో ముగియనుండటంతో.. ఆయన ప‌ద‌వీకాలాన్ని అక్టోబరు 15 వరకు పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంలో పిటిషన్ వేసింది. దాన్ని విచారించిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ డైరెక్టర్‌ పదవీ కాలాన్ని సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు పొడిగించింది.

2018 నవంబర్‌లో సంజయ్ కుమార్ మిశ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత ఆయనకు 60 ఏళ్లు రావడంతో పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అయితే 2020 నవంబర్‌లో ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచి మూడేళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులను సవరించింది. అనంతరం 2022లోనూ మూడోసారి ఆయన పదవీ కాలాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ పలువురు విపక్ష నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఈడీకి సాధ్యమైనంత త్వరగా కొత్త డైరెక్టర్‌ను నియమించాలని కేంద్రానికి సూచించింది.


Similar News