Bahraich : 23 ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు స్టే.. బుల్డోజర్‌ యాక్షన్‌కు బ్రేక్

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‎లోని బహ్రైచ్ జిల్లా మహరాజ్‌గంజ్‌లో ముస్లిం వర్గానికి చెందిన 23 ఇళ్లపై బుల్డోజర్‌ యాక్షన్‌కు బ్రేక్ పడింది.

Update: 2024-10-20 18:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‎లోని బహ్రైచ్ జిల్లా మహరాజ్‌గంజ్‌లో ముస్లిం వర్గానికి చెందిన 23 ఇళ్లపై బుల్డోజర్‌ యాక్షన్‌కు బ్రేక్ పడింది. ఆ ఇళ్ల కూల్చివేతలపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. సదరు భవనాల యజమానులకు ఉత్తరప్రదేశ్ ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) జారీ చేసిన నోటీసులలోని ఆదేశాల అమలును నిలిపివేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పీడబ్ల్యూడీ ఇచ్చిన నోటీసులపై స్పందించేందుకు బాధిత వ్యక్తులకు కోర్టు 15 రోజుల టైం మంజూరు చేసింది. ఈ పిటిషన్‎పై తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. అక్టోబర్ 13న మహరాజ్‌గంజ్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన కారణంగా ఆ 23 ఇళ్ల విషయంలో ఉత్తరప్రదేశ్ పీడబ్ల్యూడీ విభాగం కఠిన వైఖరిని తీసుకుంది. ఆ రోజున పట్టణంలోని ఒక ప్రార్థనా స్థలం లోపల భారీగా సౌండ్స్ పెట్టారు. దీనిపై ఓ వర్గం వారు అభ్యంతరం తెలిపారు. ఇరువర్గాల వాగ్వాదంతో మొదలైన ఈ గొడవ.. ఘర్షణ స్థాయికి పెరిగిపోయింది. ఈక్రమంలో జరిగిన కాల్పుల్లో రామ్ గోపాల్ మిశ్రా అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో బహ్రైచ్‌లో మత ఘర్షలు జరగగా, పలువురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు 1000 మందికిపైగా స్థానికులపై కేసులు నమోదు చేశారు.ఈ హింసాకాండలో అబ్దుల్ హమీద్‌ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అబ్దుల్ హమీద్‌ సహా 23 మంది వ్యక్తుల ఇళ్లు, దుకాణాలకు శనివారం రోజు యూపీ పీడబ్ల్యూడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ స్థలాల్లో ఆ ఇళ్లను నిర్మించుకున్నారని.. వాటిని మూడు రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆదేశించారు. దీంతో బాధితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తమ నివాసాలపై చేపట్టనున్న బుల్డోజర్ యాక్షన్‎ను నిలిపివేయాలని కోరారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు.. పీడబ్ల్యూడీ నోటీసులపై స్టే విధించింది. 


Similar News