కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది.. జైలులో 8.5 కిలోల బరువు తగ్గారు: సంజయ్ సింగ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని, జైలులో ఆయన 8.5 కిలోల బరువు తగ్గారని ఆప్ నేత సంజయ్ సింగ్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు

Update: 2024-07-13 10:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని, జైలులో ఆయన 8.5 కిలోల బరువు తగ్గారని ఆప్ నేత సంజయ్ సింగ్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు అదనంగా, ఆయన రక్తంలో చక్కెర స్థాయి ఐదు రెట్లు పడిపోయింది. కేజ్రీవాల్ నిరంతరం బరువు తగ్గుతున్నారు. ఇది తీవ్రమైన అనారోగ్యాన్ని సూచిస్తుందని సంజయ్ సింగ్ అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికి కూడా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని జులై 25 వరకు పొడిగించింది, ఈ క్రమంలో శనివారం ఆప్ నేత సంజయ్ సింగ్ ఆయన ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదిలా ఉంటే అంతకుముందు కూడా ఆప్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అరెస్టు సమయంలో ఆయన 70 కిలోల బరువు ఉండగా జూన్ 22 నాటికి 62 కిలోలకు తగ్గారని పేర్కొంది. ఆయనను సమగ్ర వైద్య పరీక్షల కోసం సిఫార్సు చేసినప్పటికి కొన్ని రక్త పరీక్షలు మాత్రమే నిర్వహించారని, అత్యంత ముఖ్యమైన గుండె, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఇంకా చేయలేదని ఆప్ గతంలో వాదించింది.

Tags:    

Similar News