Chandrasekhar: కేరళ బీజేపీ చీఫ్‌గా రాజీవ్ చంద్ర శేఖర్!
కేరళ బీజేపీ చీఫ్‌గా మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నియామకం కానున్నారు. త్వరలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ బీజేపీ చీఫ్‌గా మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandra shekar) నియామకం కానున్నారు. తిరువనంతపురం (Thiruvanantha puram) లో తాజాగా జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రాజీవ్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయగా ఆయన నియామకానికి ఆమోదం తెలిపినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. సోమవారం జరిగే పార్టీ సమావేశంలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ పరిశీలకుడు ప్రహ్లాద్ జోషి (Prahlad joshi) ఆయన పేరును వెల్లడించే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో 2020 నుంచి పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన సురేంద్రన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కేరళలో చాలా రోజుల తర్వాత 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. దీంతో అప్పటి నుంచి రాష్ట్రంలో తన ఉనికిని చాటు కోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా రాజీవ్ చంద్రశేఖర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తోందని పలువురు భావిస్తున్నారు.
1961 మే 31న జన్మించిన రాజీవ్ చంద్రశేఖర్ చికాగోలో ఉన్నత విద్యను అభ్యసించారు. కర్ణాటక నుంచి 2006లో మొదటి సారి రాజ్యసభలో అడుగుపెట్టిన ఆయన వరుసగా మూడు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగానే ఉన్నారు. 2021లో కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు. అంతేగాక కేరళ ఎన్డీఏ ఉపాధ్యక్షుడిగానే పని చేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికా పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.