Palestinians: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో తీవ్ర విషాదం.. 50,000 మంది మృతి
ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కాల్పుల విరమణ అనంతరం మరింత భీకరంగా మారింది. ఇజ్రాయెల్ గాజాపై తీవ్రంగా విరుచుకుపడుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ (Israel Hamas) మధ్య కొనసాగుతున్న యుద్ధం కాల్పుల విరమణ అనంతరం మరింత భీకరంగా మారింది. మొదటి దశ సీజ్ ఫైర్ (Seize fire) ముగిసిన వెంటనే గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. పలు ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ యుద్ధంలో మరణించిన వారి సంఖ్యను వెల్లడించింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 50, 021 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. అంతేగా 1,13,274 మంది తీవ్రంగా గాయపడ్డట్టు పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాల్పుల విరమణ అనంతరం ఇటీవల ఇజ్రాయెల్ వైమాణిక దాడుల్లో 573 మంది మరణించారని తెలిపింది. మరణించిన వారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నట్టు వెల్లడించింది.
కాగా, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై ఉగ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడితో యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అనేక మంది హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టినప్పటికీ వార్ ఆగడం లేదు. తీవ్ర ప్రయత్నాల అనంతరం అమెరికా (America), ఖతార్(Qutar), ఈజిప్టు (Egypt) మధ్య వర్తిత్వంతో ఇటీవల ఇరు పక్షాల మధ్య ఆరు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే రెండో దశపై చర్చలు కొనసాగకముందే ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. దీంతో గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది.