గుడిసెపై ఇసుక ట్రక్కు బోల్తా.. ఒకే కుటుంబంలోని 8మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇసుక లోడుతో వెళ్తున్న ట్రక్కు ఓ గుడిసెపై బోల్తాపడటంతో ఓకే కుటుంబంలోని 8 మంది మృతి చెందారు.

Update: 2024-06-12 04:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇసుక లోడుతో వెళ్తున్న ట్రక్కు గుడిసెపై బోల్తాపడటంతో ఓకే కుటుంబంలోని 8 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గంగా నది నుంచి ఇసుకతో కూడిన ట్రక్కు హర్దోయికి వెళ్తోంది. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున మల్లవాన్‌ పట్టణ ప్రాంతంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెల పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా..అదే ఫ్యామిలీలోని ఓ బాలికకు తీవ్రంగా గాయాలయ్యాయి.

వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ట్రక్కును సీజ్ చేశారు. గాయపడ్డ బాలిక పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను బల్లా (45), అతని భార్య ముండి (42) వారి ముగ్గురు పిల్లలు సునైనా (5), లల్లా (4), బుద్ధ (4), అల్లుడు కరణ్‌(25), అతని భార్య హీరో (22), వారి కుమారుడు కోమల్ (5)గా గుర్తించారు. గాయపడిన బాలికను బిట్టుగా తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.


Similar News