IMA: భద్రత, శాంతియుత వాతావరం లగ్జరీలు కావు.. బెంగాల్ సీఎంకు ఐఎంఏ లేఖ

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్లు గత వారం రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) సీఎం మమతా బెనర్జీకి లేఖ రాసింది.

Update: 2024-10-11 06:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్లు గత వారం రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) సీఎం మమతా బెనర్జీకి లేఖ రాసింది. జూనియర్‌ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరింది. యువ వైద్యులు నిరాహార దీక్షలు చేపట్టిన వారం కావొస్తుందని.. డిమాండ్లపై తక్షణమే దృష్టి సారించాలని ఐఏఎం సూచించింది. న్యాయమైన డిమాండ్లకు తాము మద్దతిస్తున్నామని పేర్కొంది. ‘ప్రభుత్వానికి అన్ని డిమాండ్లను నెరవేర్చగలిగే సామర్థ్యం ఉంది. శాంతియుత వాతావరణం, భద్రత.. అనేవి లగ్జరీలు కావని.. ఇది ఒక అవసరం. ప్రభుత్వాధినేతగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. యువవైద్యుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ నిరాహార దీక్షలతో యావత్‌ భారతదేశంలోని వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మీరే (సీఎం మమతా బెనర్జీ) వారి ప్రాణాలను కాపాడగలరని విశ్వసిస్తున్నాం. మా నుంచి ఏదైనా సహాయం చేయగలిగితే సంతోషంగా చేస్తాం’ అని ఐఎంఏ లేఖలో పేర్కొంది.

నిరాహార దీక్ష

కోల్ కతా ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసులో సంచలనంగా మారింది. అయితే, బాధితురాలికి న్యాయం చేయడంతోపాటు పని ప్రదేశంలో భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు నిరసనకు దిగారు. డిమాండ్ల సాధన కోసం గతవారం రోజులుగా మరోసారి నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ దీదీకి లేఖ రాసింది. శనివారం సాయంత్రం నుంచి ఏడుగురు జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వారిలో ఒకరి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి పాలయ్యారు. అతన్ని అనికేత్ మహతోగా గుర్తించారు. ప్రస్తుతం అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే, నిరాహార దీక్ష చేస్తున్న ఏడుగురు వైద్యుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి అక్కడికి నలుగురు స్పెషలిస్ట్ వైద్యుల బృందాన్ని బెంగాల్ ఆరోగ్యశాఖ పంపింది."మేము వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి ఇక్కడకు వచ్చాము. ఐదు రోజుల నిరాహార దీక్ష వల్ల వారి ఆరోగ్యం క్షీణించడం సహజం. మేము వారి తల్లిదండ్రుల వంటి వారం. వారిని ఆస్పత్రిలో చేరాలని సూచించాం." అని వైద్యబృందం తెలిపింది.


Similar News