Akhilesh Yadav vs BJP: లక్నోలో సమాజ్ వాదీ పార్టీ నేతల ఆందోళన.. ఉద్రిక్తత

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఉద్రిక్తత నెలకొంది.నగరంలోని జయప్రకాష్‌ నారాయణ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌(జేపీఎన్‌ఐసీ) వద్ద సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) నేతలు ఆందోళన చేపట్టారు.

Update: 2024-10-11 08:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఉద్రిక్తత నెలకొంది.నగరంలోని జయప్రకాష్‌ నారాయణ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌(జేపీఎన్‌ఐసీ) వద్ద సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) నేతలు ఆందోళన చేపట్టారు. జయప్రకాష్‌ నారాయణ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌కు వెళ్లనివ్వకుండా ప్రభుత్వం తనను అడ్డుకుంటోందని ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ ఆరోపించారు. సమాజ్‌వాదీ కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు. అఖిలేష్ యాదవ్ టిన్ షీట్‌లపై 'సమాజ్‌వాదీ పార్టీ జిందాబాద్' అని నినాదాలు రాశారు. అంతేకాకుండా జేపీఎన్ఐసీ గేట్ ముందు కొంతమంది కార్మికులు టిన్ షీట్లను ఏర్పాటు చేస్తున్న క్లిప్‌ను కూడా సమాజ్ వాదీ పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. "పనికిరాని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై నిరంతరం దాడి చేస్తోంది. ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వం లక్నోలో నిర్మించిన జేపీఎన్ఐసీవంటి అభివృద్ధి పనులను నాశనం చేసి గొప్ప వ్యక్తులను అవమానించింది. సోషలిస్టులు ఈ నియంతలకు తలవంచరు!" అని సమాజ్ వాదీ పార్టీ ఎక్స్ లో పేర్కొంది.

జేపీఎన్ఐసీ దగ్గర ఉద్రిక్తత

శుక్రవారం(అక్టోబర్‌11) జయప్రకాష్‌నారాయణ్‌ జయంతి సందర్భంగా గురువారం రాత్రి అఖిలేష్‌ యాదవ్‌ జేపీఎన్‌ఐసీని సందర్శించారు. అక్కడ మెయిన్‌గేట్‌ వద్ద పోలీసులు రెండు అడ్డుతెరలు ఏర్పాటు చేయడంపై అఖిలేష్‌ మండిపడ్డారు. ప్రభుత్వం ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతో లక్నోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జేపీఎన్ఐసీ భవనం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన గేటు వెలుపల బారికేడ్లు ఏర్పాటు చేశారు. బిల్డింగ్ ఆవరణలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసు సిబ్బంది మోహరించారు. గేట్ వెలుపల వాటర్ ఫిరంగితో పాటు టియర్ గ్యాస్ షెల్‌లను విడుదల చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బృందంతో పాటు మహిళా పోలీసు బలగాలు కూడా మోహరించారు. జేపీఎన్ఐసీకి వరకు వెళ్లే రహదారిని బారికేడ్లతో మూసివేశారు. అఖిలేష్ యాదవ్ ఇంటి బయట కూడా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ఇంటికి వెళ్లే రెండు మార్గాల్లో ట్రాఫిక్‌ను బారికేడ్లతో ఆంక్షించారు.

బీజేపీ విమర్శలు

ఉత్తరప్రదేశ్ మంత్రి సురేష్ ఖన్నా సమాజ్ వాదీ పార్టీని "ఫ్యూజ్డ్ ట్రాన్స్‌ఫార్మర్" అని అభివర్ణించారు. సమాజ్‌వాదీ పార్టీ పాడయిన ట్రాన్స్ ఫార్మర్ అని.. బీజేపీ మంచి ట్రాన్స్ ఫార్మర్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు కాషాయపార్టీతోనే ఉన్నారని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి మనీష్ శుక్లా అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. 'సమాజ్‌వాదీ పార్టీ నేతలు కేవలం రాత్రిపూట మాత్రమే ఎందుకు యాక్టివ్‌గా ఉంటారో అఖిలేష్ యాదవ్ సమాధానం చెప్పాలి. ఆయన చర్య చిన్నపిల్లలా ఉంది.’ అని పేర్కొన్నారు. ఇకపోతే, అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేపీఎన్ఐసీని ప్రారంభించారు. అయితే, 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి.


Similar News