పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ: బీజేపీ రాష్ట్ర చీఫ్ సునీల్ జాఖర్

లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Update: 2024-03-26 06:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. రాష్ట్రంలోని 13 పార్లమెంటు నియోజకవర్గాల్లో సొంతంగానే పోటీ చేస్తామని తెలిపారు. పంజాబ్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ మేలు చేస్తుందని చెప్పారు. ‘పంజాబ్ యువత, రైతులు, వ్యాపారులు, వెనుకబడిన తరగతుల వారి భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. గత పదేళ్లలో రైతులు పండించిన ప్రతి గింజనూ సేకరిస్తున్నాం. దశాబ్దాలుగా ప్రజలు డిమాండ్ చేస్తున్న కర్తార్‌పూర్ కారిడార్‌ను కూడా మోడీ ఏర్పాటు చేశారు’ అని పేర్కొన్నారు.

గతంలో ఎన్డీయేలో శిరోమణి అకాలీదళ్‌(ఎస్ఏడీ) భాగస్వామిగా ఉండేది. కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 2020లో ఎన్డీయేను వీడింది. అయితే రైతుల నిరసనల అనంతరం వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి ఎన్డీయేతో ఎస్ఏడీ పొత్తు పెట్టుకుందని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే పొత్తు లేదని బీజేపీ ప్రకటించడం గమనార్హం. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 2, ఎస్ఏడీ 2, కాంగ్రెస్ 8, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 1 స్థానాల్లో గెలుపొందాయి.

Tags:    

Similar News