RSS chief: ఆర్ఎస్ఎస్ వందో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా చీఫ్ మోహన్ భగవత్ కీలకవ్యాఖ్యలు

జాతీయ భాష గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-12 08:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ భాష గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏర్పాటై 100వ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో ఈ విజయదశమిని పురస్కరించుకొని మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ ప్రసంగించారు. భారత్‌లో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే అని ఆయన అన్నారు. సామాజిక ఐక్యత, సామరస్యం కోసం కులమతాలకతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలన్నారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలకు వ్యతిరేకంగా జరిగిన దాడులను ఖండించారు. అలాగే ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధంపై ఆందోళన వ్యక్తంచేశారు.

కోల్ కతా ఘటనపై..

కోల్ కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై మోహన్ భగవత్ స్పందించారు. ‘‘మన సమాజానికి అదొక సిగ్గుచేటు ఘటన. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, నేరం జరిగినప్పటికీ.. బాధితురాలికి న్యాయం జరగకపోవడం దారుణం. ఇది సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయుల భాషలు వేరైనా.. పౌరుడిగా అందరి ఆలోచనా ఒకే విధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్.రాధాకృష్ణన్ సహా పలువురు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


Similar News