అయోధ్య రామమందిరం పైకప్పు నుంచి నీటి లీకేజీ : ఆచార్య సత్యేంద్ర దాస్

దిశ, నేషనల్ బ్యూరో : వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిరం మొదటి అంతస్తు పైకప్పు నుంచి నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.

Update: 2024-06-24 19:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో : వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిరం మొదటి అంతస్తు పైకప్పు నుంచి నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. ‘‘ఇలా ఎందుకు జరుగుతోంది.. గుడి పైకప్పును ఎలా నిర్మించారు.. గుడి పైకప్పు నుంచి నీరు లీక్ కాకుండా ఏం చేయాలి ?’’ అనే అంశాలపై ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు తీవ్రరూపు దాలిస్తే అయోధ్య రామాలయంలో నీటి లీకేజీ కారణంగా భక్తులు పూజలు చేయడం కూడా కష్టతరంగా మారే అవకాశం ఉందని సత్యేంద్ర దాస్ చెప్పారు.

ఈయన వ్యాఖ్యలతో అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా ఏకీభవించారు. పైకప్పు నుంచి నీటి లీకేజీ సమస్య ఉన్న మాట నిజమేనన్నారు. ఆలయం పైకప్పు మరమ్మతులు, వాటర్‌ఫ్రూఫింగ్ చేయిస్తామన్నారు. ‘‘ప్రాచీన ఆలయ నిర్మాణ శైలిలో భాగంగానే గురు మండపాన్ని ఓపెన్‌గా వదిలాం. ఆలయ గోపురం నిర్మాణ పనులు పూర్తయ్యాక.. ఈ ఓపెన్ ప్రదేశాన్ని కవర్ చేస్తుంది. ఆలయం గర్భగుడి లోపల డ్రైనేజీ వ్యవస్థ లేదు. మ్యానువల్‌గా ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పైకప్పు నుంచి నీటి లీకేజీకి ఆలయ డిజైన్ సమస్య కానీ, ఆలయ నిర్మాణ సమస్య కానీ కారణం కాదు’’ అని నృపేంద్ర మిశ్రా స్పష్టం చేశారు.


Similar News