JK Election Results: ప్రజాతీర్పుని గౌరవించాలి.. ఎలాంటి కుట్రలు చేయొద్దు- ఒమర్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా.. అక్కడి ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా.. అక్కడి ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యంలో దూసుకెల్తోంది. ఈ సందర్భంగా ఎన్సీ పార్టీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి రాజకీయ కుట్రలు చేయొద్దని అన్ని పార్టీలను కోరారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేం విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నాం. జమ్ముకశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం కాసేపట్లో తెలుస్తుంది. కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలి. ప్రజల తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వారు ఎలాంటి కుయుక్తులకు పాల్పడవద్దు. కాషాయ పార్టీ ఎలాంటి కుట్రల్లో భాగం కావొద్దు’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే, రెండు అసెంబ్లీ స్థానాలు గండేర్బల్, బుడ్గామ్ నుంచి పోటీపడిన ఒమర్.. ప్రస్తుతానికి రెండుచోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
కొనసాగుతున్న కౌంటింగ్
ఇదిలాఉంటే.. ఒమర్ అబ్దుల్లా ఎక్స్ అకౌంట్ లో కొన్ని సెల్ఫీలు పోస్టు చేశారు. “కౌంటింగ్ రోజున 7K రన్ చేశా. క్రితంసారి సరిగ్గా పూర్తిచేయలేకపోయా. ఈసారి బాగుంటుందని ఆశిస్తున్నా’’ అని అర్థం వచ్చేలా పోస్టు పెట్టారు. ఇకపోతే, జమ్ముకశ్మీర్ లోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగగా.. మంగళవారం ఫలితాలు వెలువడుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. భాజపా 25, కాంగ్రెస్ 11, పీడీపీ 5, స్వతంత్రులు 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.