జియో యూజర్లకు షాక్.. రీఛార్జి ప్లాన్ల ధరలు పెంపు

దిశ, బిజినెస్ బ్యూరో : రిలయన్స్‌ జియో వినియోగదారులకు షాక్ ఇచ్చింది.

Update: 2024-06-27 18:53 GMT

దిశ, బిజినెస్ బ్యూరో : రిలయన్స్‌ జియో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తమ రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్‌‌లను పెంచనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఒక్కో జియో ప్లాన్‌ మీద కనిష్ఠంగా 12.5 శాతం నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు టారిఫ్ రేట్లు పెరుగుతాయని గురువారం అనౌన్స్ చేసింది. దీంతోపాటు పలు కొత్త రీఛార్జి ప్లాన్లను కూడా జియో తీసుకొచ్చింది. కొత్త టారిఫ్‌ అమలు నాటి నుంచి రోజుకు 2 జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్లలో మాత్రమే అపరిమిత 5జీ డేటా సౌకర్యం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త టారిఫ్ రేట్లు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 1 జీబీ డాటా యాడాన్ ప్యాక్ ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచింది. 75జీబీ నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరను రూ.399 నుంచి రూ.449కి పెంచింది. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చే అన్ లిమిటెడ్ డేటా, కాలింగ్ ప్లాన్ ధరను రూ.666 నుంచి రూ.799కి పెంచింది. 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన బేస్‌ ప్లాన్‌ ధర 21.9 శాతం పెరిగి రూ.189కి చేరింది. రోజుకు 1.5 జీబీ డేటా అందించే రీఛార్జ్ ప్లాన్‌ రేటు 25 శాతం మేర పెరిగి రూ.239 అయ్యింది. ఇయర్ రీఛార్జ్ ప్లాన్ రేటు 20 శాతం మేర పెరిగి రూ.3,599కి చేరింది. దేశంలోని 5జీ మొబైల్స్‌లో దాదాపు 85 శాతం జియోతోనే పనిచేస్తున్నాయని కంపెనీ ప్రకటించింది. కాగా, గత రెండేళ్ల కాలంలో జియో ప్రీ పెయిడ్ ప్లాన్ల ధరను పెంచడం ఇదే మొదటి సారి.

జియో సేఫ్‌ - క్వాంటం సెక్యూర్‌, జియో ట్రాన్స్‌లేట్‌ - ఏఐ అనే రెండు కొత్త సర్వీసులను జియో ప్రవేశపెట్టింది. వీటిని జియో యూజర్లకు ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు జియో ప్రకటించింది. జియో సేఫ్‌ - క్వాంటం సెక్యూర్‌ యాప్ ద్వారా కాలింగ్‌, మెసేజింగ్‌, ఫైల్‌ బదిలీ చేయొచ్చు. జియో యూజర్లు ఏడాది తర్వాత దీన్ని వాడాలంటే నెలకు రూ.199 చెల్లించాలి. జియో ట్రాన్స్‌లేట్‌ - ఏఐ యాప్‌ ద్వారా వాయిస్‌ కాల్‌, వాయిస్‌ మెసేజ్‌, టెక్ట్స్‌, ఇమేజ్‌లోని సమాచారాన్ని కృత్రిమ మేధతో అనువాదం చేయొచ్చు. జియో యూజర్లు ఏడాది తర్వాత దీన్ని వాడాలంటే ప్రతినెలా రూ.99 చెల్లించాలి.

Similar News