L&T Chairman: వారానికి 90 గంటలా? ఎల్అండ్ టీ ఛైర్మన్ వ్యాఖ్యలపై విమర్శలు

వారానికి 90 గంటల పాటు పని చేయాలని పిలుపునిచ్చిన ఎల్ అండ్ టీ ఛైర్మన్ (L&T chairman SN Subrahmanyan) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Update: 2025-01-10 07:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వారానికి 90 గంటల పాటు పని చేయాలని పిలుపునిచ్చిన ఎల్ అండ్ టీ ఛైర్మన్ (L&T chairman SN Subrahmanyan) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపైన సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇటు బిజినెస్ వర్గాలు, అటు సెలబ్రిటీలో దీనిపై స్పందింస్తున్నారు. ఆదివారం సెలవును వదిలేయాలన్న సుబ్రహ్మణ్యన్ పై ప్రముఖ వ్యాపారవేత్త ఆర్జీపీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంకా(RPG Group chief Harsh Goenka) విమర్శలు గుప్పించారు. "వారానికి 90 గంటలా? ఆదివారానికి 'సన్-డ్యూటీ'గా పేరు మార్చి 'డే ఆఫ్' అనేది ఒక పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు!" అని చురకలు అంటించారు. "కష్టపడి, తెలివిగా పనిచేయడాన్ని నేను నమ్ముతాను, కానీ జీవితాన్ని శాశ్వత కార్యాలయంగా మారిస్తే అది బర్నవుట్ కు దారితీస్తుంది తప్పా.. విజయాన్ని తీసుకురాదన్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది.. ఐచ్ఛికం కాదు.. తప్పనిసరి అనేది నా అభిప్రాయం. స్మార్ట్ గా పనిచేయండి.. బానిసలా కాదు" అని సోషల్ మీడియా ఎక్స్ లో గోయెంకా సుదీర్ఘ పోస్టు పెట్టారు.

దీపికా పదుకోణ్ అసహనం

సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యపై బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ (Deepika Padukone) అసహనం వ్యక్తంచేశారు. ‘‘ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యా’’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యం ముఖ్యమని.. ఆ పోస్ట్‌కు #MentalHealthMatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అయితే, సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై కంపెనీ వివరణ ఇచ్చింది. దానిపైనా నటి స్పందించారు. ‘ఈ క్లారిటీ ఇచ్చి మరింత దిగజారారు’ అని రాసుకొచ్చారు.

ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఏమన్నారంటే?

ఇటీవల ఉద్యోగులతో జరిగిన సంభాషణలో సుబ్రహ్మణ్యన్ కంపెనీ ఆరు రోజుల పని వారం గురించి ప్రసంగించారు. “నేను మిమ్మల్ని ఆదివారాల్లో పని చేయమని బలవంతం చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మిమ్మల్ని ఆదివారాల్లో పని చేయిస్తే.. మరింత సంతోషంగాఉంటా.. ఎందుకంటే నేను ఆదివారాల్లో పనిచేస్తా” అని ఆయన అన్నారు. "ఇంట్లో కూర్చొని మీరు ఏమి చేస్తారు? మీరు మీ భార్యను ఎంతసేపు చూడగలరు? రండి, ఆఫీసుకు వెళ్లి పని ప్రారంభించండి" అని అడుగుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై కంపెనీ స్పష్టతనిచ్చింది. ‘ఎనిమిది దశాబ్దాలుగా జాతి నిర్మాణమే ఎల్‌ అండ్‌ టీకి ప్రధాన లక్ష్యంగా ఉంది. భారత మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను ఎల్‌ అండ్‌ టీ మెరుగుపరిచింది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే క్రమంలో అసాధారణ లక్ష్యాలను చేరాలంటే అసాధారణ కృషి అవసరం. ఈ విస్తృత లక్ష్యం గురించే ఛైర్మన్‌ వ్యాఖ్యానించారు’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News