యూపీ నుంచి రాహుల్, ప్రియాంక గాంధీల పోటీపై రాజ్‌నాథ్ సింగ్ స్పందన

ఆలస్యమెందుకు, ఎన్నికల్లో భాగంగా ఎవరైనా పోటీకి దిగొచ్చు. మేము కూడా పోటీకి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

Update: 2024-04-30 16:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 80కి 80 స్థానాలను కైవసం చేసుకుంటుందని అన్నారు. ఇటీవల రెండో దశ పోలింగ్ సందర్భంగా యూపీలో తక్కువ ఓటింగ్ శాతం నమోదవడంతో అధికార బీజేపీకి ప్రతికూలంగా ఫలితాలు ఉంటాయనే సంకేతాలను కేంద్ర మంత్రి కొట్టిపారేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలది అస్పష్ట రాజకీయాలని అన్నారు. 'ప్రధాని మోడీకి ఉన్న ప్రజాదరణ అసామాన్యమైనది. ఆయన ప్రపంచంలో భారత స్థాయిని పెంచారు. దేశమంతా మరోసారి ప్రధానిగా మోడీనే కోరుకుంటోంది. ప్రజలు మోడీపై విశ్వాసం కలిగి ఉన్నారని' చెప్పారు. యూపీలో మొత్తం అన్ని స్థానాల్లో బీజేపీదే విజయమని ఉద్ఘాటించారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీలోని అమేఠీ, రాయ్‌బరేలీల నుంచి పోటీ చేయనున్నారనే అంశంపై స్పందించిన రాజ్‌నాథ్ సింగ్.. అయితే ఆలస్యమెందుకు, ఎన్నికల్లో భాగంగా ఎవరైనా పోటీకి దిగొచ్చు. మేము కూడా పోటీకి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. యూపీలో తక్కువ ఓటింగ్‌పై స్పందించిన ఆయన.. విపక్షాల ఓటర్లలో ఉత్సాహం లేకపోవడం ఇందుకు కారణమన్నారు. కొన్నిచోట్ల ఎండ వేడిమి కూడా కారణమైందని తెలిపారు. అయితే, బీజేపీ మాత్రం బంపర్ మెజారిటీతో గెలుస్తుందని, మోడీ మళ్లీ ప్రధాని అవుతారని పేర్కొన్నారు. ఇక, ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో దర్యాప్తు సంస్థలపై వస్తున్న ఆరోపణలకు బదులిస్తూ.. ఏజెన్సీలు తప్పు చేస్తే కోర్టులను ఆశ్రయించవచ్చు. కోర్టు కూడా ఉపశమనం ఇవ్వట్లేదంటే న్యాయస్థానాలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయని చెబుతారా? అవన్నీ అసత్య ప్రచారాలని వెల్లడించారు. 

Tags:    

Similar News