Omar abdhullah: ఎన్డీఏలో చేరాలని ఎలాంటి ఒత్తిడీ లేదు.. సీఎం ఒమర్ అబ్దుల్లా
ఎన్డీఏ కూటమిలో చేరాలని ఎన్సీ పై ఒత్తిడి తీసుకొస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్డీఏ కూటమిలో చేరాలని జమ్మూ కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్(NC)పై పలువురు నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar abdhullah) స్పందించారు. పుకార్లను తోసిపుచ్చిన ఒమర్.. ఎన్డీఏలో చేరాలని తమపై ఎలాంటీ ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. ఎన్సీ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని తెలిపారు. ఏ కూటమిలో చేరబోదని తేల్చి చెప్పారు. గురువారం ఆయన శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్న హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా కేంద్రం తన వాగ్దానాన్ని నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ‘మేము అధికారంలోకి వచ్చి రెండు నెలల దాటింది. కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మాకు సమయం పట్టింది. గత ప్రభుత్వానికి, ప్రస్తుత పాలనకు చాలా వ్యత్యాసం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ధ్వంధ అధికారం కేంద్రాలు ప్రయోజనకరమైనవి కావని తెలిపారు. ఒకే దగ్గర పాలన కేంద్రీకృతమైతే సమర్థవంతమైన పాలన అందుతుందని చెప్పారు. అయితే లెఫ్ట్ నెంట్ గవర్నర్‌తో కొన్ని విభేదాలున్నాయని, అయితే అవి త్వరలోనే సర్దుకుంటాయన్నారు.