అరుదైన కార్పెంటర్ షార్క్ చేప కర్నాటకలో చిక్కింది.. పట్టడం చాలా డేంజర్? చూడండి
వాటి రెక్కలు, రంపాలు, దంతాల కోసం కూడా వేటాడుతున్నారు. Rare carpenter shark caught in Karnataka coast.
దిశ, వెబ్‌డెస్క్ః సముద్ర గర్భంలో మనుషుల కంట పడని ఎన్నో జీవులు ఎన్నో ఏళ్ల తరబడి బతుకుతున్నాయి. అయితే, చేపల వేట పెరుగుతున్న కొద్దీ వాటిలో చాలా జాతులు అంతరించిపోతున్నాయి. అలాంటి జాతుల్లో ఒకటైన లార్జ్‌టూత్ సా ఫిష్ తాజాగా కర్నాటక కోస్ట్‌లో వలకు చిక్కింది. సాధారణంగా మనిషి కంట కూడా పడిని ఈ చేపను కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మత్స్యకారులు పట్టుకున్నారు. 10 అడుగుల పొడవు, 250 కిలోల బరువు ఉన్న ఈ చేపను ప్రస్తుతం వేలంలో పెట్టారు.
కార్పెంటర్ షార్క్ అని కూడా పిలుచుకునే ఈ చేప ప్రమాదవశాత్తు మాల్పే తీరంలో ఉండే "సీ కెప్టెన్" అనే మత్స్యకార బోటు వలల్లో చిక్కుకుంది. ఎంతో అరుదైన చేప కావడంతో ఈ చేప వీడియోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీన్ని మంగుళూరుకు చెందిన వ్యాపారికి విక్రయించినట్లు మీడియాలో పేర్కొన్నప్పటికీ ధరను ప్రకటించలేదు.
A critically endangered species- the sawfish or carpenter shark becomes a victim of commercial net fishing in Malpe Udupi. pic.twitter.com/mOgElC45Al
— Deepak Bopanna (@dpkBopanna) March 11, 2022
ఈ లార్జ్‌టూత్ సా ఫిష్ ఐదు రకాల రంపపు చేప జాతులలో ఒకటి. వీటిలో మూడు IUCN రెడ్ లిస్ట్‌లో ఉండగా లార్జ్‌టూత్‌తో ఇందులో ఉంది. ఇవి వేగంగా అంతరించిపోతున్నాయన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వాటి మూతి రంపంలా బారుగా మొనలు కలిగి ఉండటం వల్ల వలలకు సులువుగా చిక్కుకుపోతున్నాయి. దీని ఫలితంగా సాఫిష్ సంఖ్య 90% పైగా క్షీణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటిని వాటి రెక్కలు, రంపాలు, దంతాల కోసం కూడా వేటాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటిని ఔషధ తయారీలో, తినడానికి వినియోగిస్తారు.
అయితే, అంతర్జాతీయంగా వీటి రవాణా, విక్రయాలను నిషేధించారు. వన్యప్రాణి (రక్షణ) చట్టం 1972లోని షెడ్యూల్ 1 కింద వీటిని వర్గీకరించారు. ఈ చట్టం ప్రకారం ఈ జాతి వేట నిషేధించబడింది. వీటిని వేటాడిన వారికి కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోతో కొందరు వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని అంటుంటే, అధికారులు ఏం చర్య తీసుకోబోతున్నారోనని పలువురు వేచి చూస్తున్నారు.