విచారణతోనూ ‘రేప్’ను రుజువు చేయొచ్చు: జమ్మూకాశ్మీర్ హైకోర్టు

అత్యాచారం జరిగిందో.. లేదో.. నిర్ధారించే పని వైద్యులది కాదని, కోర్టుది అని జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు స్పష్టం చేసింది.

Update: 2023-08-17 16:21 GMT

జమ్మూ: అత్యాచారం జరిగిందో.. లేదో.. నిర్ధారించే పని వైద్యులది కాదని, కోర్టుది అని జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు స్పష్టం చేసింది. జననాంగాలకు ఎలాంటి గాయం కాకున్నా, నిందితుడి వీర్యం మరకలు బాధితురాలి శరీరంపై కనబడకపోయినా విచారణ చేపట్టి అత్యాచారం యొక్క నేరం నిర్ధారించబడుతుందని తెలిపింది. అత్యాచార బాధితురాలికి చికిత్స చేసే వైద్యుడి పరిధి లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన రుజువులను సేకరించడం మాత్రమేనని జస్టిస్ సంజయ్ ధర్, జస్టిస్ రాకేష్ సెఖ్రీలతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది.

రేప్ అనేది న్యాయపరమైన నిర్ణయమని, ఐపీసీ 375 సెక్షన్ ప్రకారం.. కేసుపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యత కోర్టులదే అని తెలిపింది. ఏడాది వయసున్న తన మనవరాలైన చిన్నారిపైనే అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన బోధ్‌రాజ్ అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి కింది కోర్టు విధించిన జీవిత ఖైదును సమర్ధించింది.


Similar News