CNG: సగటున రూ. 4-6 పెరగనున్న సీఎన్‌జీ ధరలు

సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఇంద్రప్రస్థ గ్యాస్ కంపెనీ అక్టోబర్ 16 నుంచి 21 శాతం తక్కువ ఏపీఎం గ్యాస్‌ను అందుకుంది

Update: 2024-10-17 18:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్(సీఎన్‌జీ) ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం సిటీ గ్యాస్ పంపిణీదారులకు గ్యాస్ కేటాయింపును 20 శాతం మేర తగ్గించిన కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని కంపెనీలు చెబుతున్నాయి. సిటీ గ్యాస్ పంపిణీదారులకు ప్రైస్-కంట్రోల్‌డ్ గ్యాస్‌(ఏపీఎం)ను ప్రభుత్వం కేటాయిస్తుంది. దీన్ని నియంత్రించడం వల్ల ఇళ్లకు సరఫరా అయ్యే గ్యాస్‌పై ప్రభావం లేకపోయినా, సీఎన్‌జీ ధరలు పెరిగేందుకు అవకాశం ఉందని సిటీ గ్యాస్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. దేశంలోని అతిపెద్ద సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ అక్టోబర్ 16 నుంచి 21 శాతం తక్కువ ఏపీఎం గ్యాస్‌ను అందుకుంది. ఇది కంపెనీ లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కంపెనీ పేర్కొంది. ఇతర సిటీ గ్యాస్ ఆపరేటర్లకు కూడా ఏపీఎం గ్యాస్ తగ్గింది. పెట్రోకెమికల్ ఉత్పత్తి కోసం గ్యాస్ క్షేత్రాల నుంచి ఏపీఎం గ్యాస్ ఉపయోగించడానికి ప్రభుత్వం ఓఎన్‌జీసీకి అనుమతించిన కారణంగానే సిటీ గ్యాస్ ఆపరేటర్లకు కోత విధించింది.అయితే, మార్కెట్లో సరఫరా కొరత లేనప్పటికీ, కోతలను క్రమంగా కేటాయించాలని, తగిన సమయం లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఎగ్జిక్యూటివ్ అధికారి ఒకరు చెప్పారు. దీనివల్ల సీఎన్‌జీ గ్యాస్ యూనిట్‌కు రూ. 4-6 వరకు పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. 

Tags:    

Similar News