'4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య'.. దోషికి మరణ శిక్ష విధించిన ట్రయల్ కోర్టు.. జీవిత ఖైదుగా మార్చిన హైకోర్టు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన సురేశ్ కుమార్‌కు ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రాజస్థాన్ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది.

Update: 2023-08-15 13:00 GMT

జైపూర్: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన సురేశ్ కుమార్‌కు ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రాజస్థాన్ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. నేరం జరిగినప్పుడు సురేశ్ వయస్సు 23 ఏళ్లు మాత్రమేనని, అతడికి ఒక ఏడాది కుమార్తె, భార్య ఉన్నారని గుర్తించిన జస్టిస్ పంకజ్ భండారీ, భువన్ గోయల్‌లతో కూడిన ధర్మాసనం శిక్షను తగ్గించాలని నిర్ణయించింది. నేరం ప్లాన్ ప్రకారం జరగలేదని, సురేశ్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని, పోలీస్ కస్టడీలో అతని ప్రవర్తన కూడా సంతృప్తికరంగా ఉందని, అతడిని సమాజానికి పెను ముప్పుగా భావించలేమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అయితే.. బాధితురాలు నాలుగేళ్ల చిన్నారి అని, ఆమెను అత్యాచారం చేసి నీటిలో ముంచి చంపేశారని గుర్తించిన బెంచ్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

2021లో జరిగిన దారుణంపై ట్రయల్ కోర్టు 2022లో మరణ శిక్ష విధించింది. దాన్ని ధ్రువీకరించేందుకు హైకోర్టుకు పంపించింది. మరోవైపు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సురేశ్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. చిన్నారి మృతదేశాన్ని చెరువులో నుంచి వెలికి తీసిన గ్రామస్థులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారని హైకోర్టుకు తెలిపారు. అయితే.. తొలుత ‘శ్యోరాజ్’ను అరెస్టు చేశారని, తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సురేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. సురేశ్‌కు శోర్యాజ్ అనే బంధువు ఉన్నందున పేర్లలో గందరగోళం తలెత్తిందని సాక్షి తర్వాత స్పష్టం చేసినట్లు కోర్టు పేర్కొన్నది. సురేశ్‌ను గ్రామస్థులు పట్టుకున్నప్పుడు ఈ ఘోరం చేసినట్లు అంగీకరించాడని, చిన్నారిని చెరువులో పడేశానని చెప్పాడని సాక్షి తెలిపాడు. సురేశ్ నుంచి తీసుకున్న డీఎన్ఏ నమూనాలు మరణించిన చిన్నారి స్కర్ట్‌పై కనుగొనబడిన డీఎన్ఏతో సరిపోలడంతో అతడే దోషిగా కోర్టు నిర్ధారించింది.


Similar News