Rahul: తమిళ మత్స్యకారుల విడుదలకు చర్యలు తీసుకోవాలి.. జైశంకర్‌కు రాహుల్ గాంధీ లేఖ

తమిళ మత్స్యకారులను రిలీజ్ చేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకోవాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Update: 2024-09-28 17:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన 37 మంది తమిళ మత్స్యకారులను వెంటనే రిలీజ్ చేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకోవాలని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్‌కు శనివారం లేఖ రాశారు. ‘ఈనెల 21న శ్రీలంక అధికారులు 37 మంది మత్స్యకారులను అరెస్టు చేశారు. అంతేగాక వారి పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం మైలాడుతురైకి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఆర్ సుధ నాకు తెలియజేశారు. ఘటన జరిగిన రోజు ప్రమాదంలో ఉన్న శ్రీలంక బోటును కాపాడేందుకు మత్స్యకారులు ప్రయాణించారు. అయినప్పటికీ అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటినందున వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి మత్య్సకారుల విడుదలకు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

భారత మత్స్యకారులను శ్రీలంక అధికారులు నిర్బంధించడం, ఆస్తుల స్వాధీనం, భారీ జరిమానాలు వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని తెలిపారు. ఈ చర్యలను ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మత్స్యకారుల హక్కులను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. శ్రీలంక అధికారులతో వెంటనే సంప్రదింపులు జరపాలని తెలిపారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గతంలో జైశంకర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 182 మంది భారతీయులను శ్రీలంక నేవీ అరెస్టు చేసి, 25 పడవలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 


Similar News