Rahul: రాహుల్ ఆయన నియోజకవర్గం కంటే వియత్నాంలోనే ఎక్కువుంటున్నారు.. బీజేపీ ఆరోపణలు
లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనలపై బీజేపీ మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. రాహుల్ తన నియోజకవర్గం కంటే వియత్నాంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆరోపించింది. రాహుల్ నిరంతరం వియత్నాం, ఇతర దేశాల్లో పర్యటిస్తున్నారని, పదే పదే ఎందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ (Ravi shanker Pradad) ప్రశ్నించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నూతన సంవత్సరం సందర్భంగా కూడా రాహుల్ వియత్నాం పర్యటనకు వెళ్లారని దాదాపు 22 రోజులు అక్కడే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన తన సెగ్మెంట్‌లోనూ ఇన్ని రోజులు గడపలేదని, ఆకస్మాత్తుగా వియత్నాం పట్ల ఎందుకు ప్రేమ కలుగుతుందని నిలదీశారు. రాహుల్ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడని కాబట్టి దేశంలో అందుబాటులో ఉండాలని తెలిపారు. వియత్నాం దేశాన్ని ఎందుకు సందర్శిస్తున్నారోననే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉందని, దీనిని ఆయన సమాధానం చెప్పాలని సూచించారు.
అలాగే రాహుల్ గాంధీ తరచుగా చేసే విదేశీ ప్రయాణాల వివరాలను పార్లమెంటుకు వెల్లడించడం గానీ, బహిరంగపరచడం గానీ జరగలేదని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ (Amith malvia) తెలిపారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని కోరారు. ‘ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ కీలక పదవిలో ఉన్నారు. ఆయన అనేక రహస్య విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు విదేశాలకు వెళ్లడం జాతీయ భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. రాహుల్ వ్యక్తిగత సందర్శనలను బీజేపీ రాజకీయం చేస్తోందని, ఒక వ్యక్తిగా ఆయనకు విదేశాలకు వెళ్లే హక్కు ఉందని పేర్కొంది.