INS Surat: ఐఎన్ఎస్ సూరత్‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ సూరత్‌ను సందర్శించారు.

దిశ, నేషనల్ బ్యూరో: న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ (Christopher Luxon), ఆ దేశ నేవీ చీఫ్ రియర్ అడ్మిరల్ గారిన్ గోల్డింగ్ భారత స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ సూరత్ (Ins surat)ను సందర్శించారు. ముంబైలోని నేవల్ డాక్ యార్డులో వార్ షిప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా నేవీ వైస్ అడ్మిరల్ సంజయ్ యుద్ధ నౌకకు సంబంధించిన వివరాలను లక్సన్‌కు వివరించారు. నౌక డిజైన్, దానిలో పొందుపర్చిన అత్యాధునిక సాంకేతిక, సామర్థ్యాల గురించి తెలియజేశారు. లక్సన్ పర్యటన అనంతరం ఇండియన్ నేవీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్శన న్యూజిలాండ్ నేవీ, ఇండియన్ నేవీల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది. కాగా, ఐన్ఎస్ సూరత్ అనేది భారత నావికాదళానికి చెందిన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధనౌక. ఇది ఈ ఏడాది జనవరి 15న నావికా దళంలోకి చేరింది. దీనిని ముంబైకి చెందిన మజ్ గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించింది. ఈ నౌక ఆత్మ నిర్భర్ భారత్ కు ఉదాహరణ అని ప్రభుత్వం గతంలో తెలిపింది.