ఇక నో ట్రాఫిక్ టెన్షన్.. ఎక్కడికైనా గాల్లో ఎగిరి వెళ్లొచ్చు!
ప్రస్తుత బిజీ ప్రపంచంలో ట్రాఫిక్ సమస్య గురించి చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత బిజీ ప్రపంచంలో ట్రాఫిక్ (Traffic) సమస్య గురించి చెప్పనక్కర్లేదు. ఇంటి నుంచి కాలు బయటపెట్టామంటే చాలు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే సమయం గడిచిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ టాక్సీలను (Air taxi) అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేపట్టాయి. రక్షణ, వ్యవసాయ, వైద్య రంగాల్లో డ్రోన్లు విజయవంతం అవ్వడంతో వాహన రంగంలోనూ దీనిపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే గాల్లో ఎగిరే ఈ టాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఓ యువకుడు కృషి చేస్తున్నారు. 'మ్యాగ్నమ్ వింగ్స్' కంపెనీని ఏర్పాటు చేసి దీనిపై ప్రయోగాలు చేపట్టారు. అయితే, ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్న ఈ ఎయిర్ టాక్సీలకు కేంద్ర అనుమతులు రావాల్సింది.
గుంటూరు స్థంభాలగరువుకు చెందిన అభిరామ్ అమెరికాలో రోబోటిక్స్ ఇంజినీరింగ్, మాస్టర్స్ పూర్తి చేశారు. వివిధ రంగాల్లో డ్రోన్లపై ప్రయోగాలు జరుగుతున్న సమయంలోనే తాను ఎయిర్ టాక్సీలను తయారు చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న సైజులో ఉండే ఎయిర్ ట్యాక్సీని తయారుచేశారు. పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించి, దాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఇక తాజాగా రెండు సీట్లతో ఒక ఎయిర్ ట్యాక్సీని రూపొందించి వీ2 అని పేరు పెట్టారు. ఈ ఎయిర్ టాక్సీ 100kmphతో 1000 అడుగుల ఎత్తులో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.