Samsung: శాంసంగ్‌కు షాక్ ఇచ్చిన పన్ను అధికారులు..రూ. 5,150 కోట్ల పన్ను నోటీసులు జారీ
ఈ మొత్తం ఇటీవలి కాలంలో అతిపెద్ద పన్ను డిమాండ్లలో ఒకటి కావడం గమనార్హం.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్‌కు భారత పన్ను అధికారులు షాక్ ఇచ్చింది. కంపెనీతో పాటు ఎగ్జిక్యూటివ్‌లకు 601 మిలియన్ డాలర్ల(రూ. 5,150 కోట్లు) పన్ను నోటీసులు జారీ చేసింది. కీలకమైన టెలికాం పరికరాల దిగుమతులపై సుంకాలను ఎగవేసిన ఆరోపణలపై పన్నులు, జరిమానా కలిపి చెల్లించాలని పన్ను అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం ఇటీవలి కాలంలో అతిపెద్ద పన్ను డిమాండ్లలో ఒకటి కావడం గమనార్హం. గతేడాది కంపెనీ సాధించిన 955 మిలియన్ డాలర్ల(రూ. 8,185 కోట్ల) నికర లాభాల్లో ఇది సగానికి పైగా ఉంది. దీనిపై కంపెనీ ట్రిబ్యునల్ లేదా కోర్టులో సవాలు చేయవచ్చని తెలుస్తోంది. కంపెనీ టెలికాం పరికరాలను దిగుమతి చేసుకునే క్రమంలో 2023 ఏడాది మొబైల్ టవర్‌లలో ఉపయోగించే కీలకమైన ట్రాన్స్‌మిషన్ కాంపొనేంట్‌పై 10-20 శాతం సుంకాలను చెల్లించలేదని అధికారులు తెలిపారు. ఈ పరికరాలను ముఖేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కోసం దిగుమతి చేసి విక్రయించింది. 'శాంసంగ్ భారతీయ చట్టాలను ఉల్లంఘించింది. ఉద్దేశపూర్వకంగా క్లియరెన్స్ కోసం కస్టమ్స్ అథారిటీకి తప్పుడు పత్రాలను సమర్పించింది' అని కస్టమ్స్ కమిషనర్ సోనాల్ బజాజ్ నోటీసుల్లో తెలిపారు. దీనిపై స్పందించిన శాంసంగ్ ప్రతినిధి.. తాము బాధ్యతాయుతంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం. దేశంలోని చట్టాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పారు.