Voilance: నాగ్‌పూర్ హింస..ప్రధాన నిందితుడితో సహా ఆరుగురిపై దేశ ద్రోహం కేసు
నాగ్ పూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో ప్రధాన సూత్రధారి ఫాహిమ్ షమీమ్ ఖాన్ సహా ఆరుగురు నిందితులపై దేశద్రోహం కేసు నమోదైంది.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని నాగ్ పూర్‌లో ఔరంగాజేబు సమాధి తొలగింపుపై జరిగిన హింసాత్మక ఘటనలో ప్రధాన సూత్రధారి ఫాహిమ్ షమీమ్ ఖాన్ (Shamim khan) సహా ఆరుగురు నిందితులపై దేశద్రోహం కేసు నమోదైంది. ఘర్షణల సమయంలో సోషల్ మీడియా (Social media)లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే ఆరోపణలపై నాగ్‌పూర్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు షేర్ చేసిన తర్వాత తప్పుడు సమాచారం వ్యాపించిందని, ఇది హింసను మరింత రేకెత్తిందని తమ దర్యాప్తులో తేలినట్టు వెల్లడించారు. ఔరంగజేబుకు వ్యతిరేకంగా జరిగిన నిరసన వీడియోను ఫహీమ్ ఎడిట్ చేసి వైరల్ చేశాడని, దీని కారణంగా హింస పెరిగిందని తెలిపారు.
ఫహీమ్ 500 మందికి పైగా సమీకరించి హింసను ప్రేరేపించాడని ఆరోపణలున్నాయి. హింసాత్మక ఘటనల్లో భాగంగా పోలీసులు ఇప్పటి వరకు 84 మందిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే షమీమ్ ఖాన్ సహా కేసు నమోదు చేసిన ఆరుగురిని అరెస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పుకార్లను వ్యాప్తి చేయడం మరియు హింసను ప్రేరేపించడం కోసం సైబర్ సెల్ 34 సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకుంది. కాగా, నాగ్‌పూర్‌లో సోమవారం రాత్రి జరిగిన హింసలో ముగ్గురు డీసీపీ ర్యాంక్ అధికారులు సహా 33 మంది పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. ఆందోళన కారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నాగ్ పూర్ లో కర్ఫ్యూ విధించారు. అయితే తాజాగా హింస తగ్గుముఖం పట్టడంతో పాలు ఆంక్షలు ఎత్తేశారు.