ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ

ఇటీవల జూన్ 9న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధిష్ఠానం రాహుల్ గాంధీని ఎన్నుకున్నప్పటికీ..

Update: 2024-06-25 17:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య నెలకొన్న పోటీ మధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పార్లమెంట్‌లో పోరాడేందుకు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకునే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ ఆమోదించారు. ఇటీవల జూన్ 9న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధిష్ఠానం రాహుల్ గాంధీని ఎన్నుకున్నప్పటికీ, ఆయన నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచారు. నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ప్రతిపక్ష నేత బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించారు. దీనికి సంబంధించి మంగళవారం రాత్రి జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీలో నాయకుల అభిప్రాయం మేరకు తన నిర్ణయాన్ని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రొటెం స్పీకర్‌కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నేత సోనియా గాంధీ లేఖ ద్వారా సమచారం అందించారు. ఈ పరిణామంతో గడిచిన పదేళ్లలో తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్షనేత ఉండనున్నారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం వల్ల ఇండియా కూటమి తరపున బలమైన గొంతును వినిపించేందుకు వీలవుతుంది. అంతేకాకుండా గత దశాబ్ద కాలంలో ప్రతిపక్ష పార్టీలు అత్యంత పటిష్టంగా ఉన్న తరుణంలో ప్రజల సమస్యల మరింత సమర్థవంతంగా పార్లమెంటులో చర్చించేందుకు అవకాశం ఉంటుంది. 


Similar News