హిమంత, మిలింద్ వంటి వాళ్లు కాంగ్రెస్ వదిలి వెళ్లిపోవాలి : రాహుల్
దిశ, నేషనల్ బ్యూరో : హిమంత బిస్వశర్మ, మిలింద్ దేవర వంటి వాళ్లు తమ పార్టీని వీడటమే మంచిదైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : హిమంత బిస్వశర్మ, మిలింద్ దేవర వంటి వాళ్లు తమ పార్టీని వీడటమే మంచిదైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌లోని అలాంటి నేతలంతా పార్టీ నుంచి వెళ్లిపోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి అసోం సీఎం అయిన హిమంత రాజకీయ వైఖరిని ఆయన తప్పుపట్టారు. ముస్లింలను ఉద్దేశించి హిమంత చేస్తున్న వ్యాఖ్యలను రాహుల్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి, తనకు కొన్ని విలువలు ఉన్నాయని.. వాటికి కట్టుబడి ఉంటామని, ఇష్టానుసారంగా మాట్లాడలేమని స్పష్టం చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో ‘డిజిటల్ మీడియా వారియర్స్’తో చిట్‌చాట్‌లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతగా మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రంతిప్పిన మిలింద్ దేవర.. ఇటీవల ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ‘‘ఇండియా కూటమితో పొత్తు ముగిసిందని కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ కానీ చెప్పలేదు. కూటమిలోనే ఉన్నామని దీదీ చెప్పారు. చర్చలు జరుగుతున్నాయి. అవే ఒక పరిష్కారాన్ని చూపిస్తాయి’’ అని బెంగాల్‌లో పొత్తులపై రాహుల్ కామెంట్స్ చేశారు.