రాహుల్ హిందూ ధర్మంపై తప్పుగా ఏమీ మాట్లాడలేదు.. శంకరాచార్య స్వామి

లోక్ సభలో హిందువులను ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం వివాదానికి దారి తీసిన విషయం తెలసిందే. దీనిపై బీజేపీ సహా ప్రధాని మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Update: 2024-07-08 13:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభలో హిందువులను ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం వివాదానికి దారి తీసిన విషయం తెలసిందే. దీనిపై బీజేపీ సహా ప్రధాని మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో రాహుల్‌కి జ్యోతిర్ మఠానికి చెందిన 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద మద్దతు తెలిపారు. రాహుల్ హిందూ ధర్మంపై తప్పుగా ఏమీ మాట్లాడలేదని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవిగా లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు స్వామి మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.‘రాహుల్ గాంధీ ప్రసంగం మొత్తం శ్రద్దగా విన్నాను. హిందూ ధర్మం హింసను తిరస్కరిస్తుందని మాత్రమే ఆయన నొక్కి చెప్పారు. అందులో ఏ మాత్రం తప్పులేదు. రాహుల్ స్పీచ్ అనైతికం అని చెప్పిన వారిని శిక్షించాలి’ అని వ్యాఖ్యానించారు.

హిందువులను అవమానించలేదు: ఎంపీ సుధ

రాహుల్ హిందువులను, హిందూ మతాన్ని అవమానించారని బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సభ్యురాలు ఖుష్బు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ సుధ స్పందించారు. ‘రాహుల్ మొదటి ప్రసంగం సమయంలో నేను లోక్‌సభలో ఉన్నాను. ఆయన హిందువులను లేదా హిందూ దేవుళ్లను అవమానించలేదు. ఆయన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని తెలిపారు. తమిళనాడులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం లో సుధ మీడియాతో మాట్లాడారు. గతంలో హిందూ దేవతలను అవమానించింది కుష్బూనే అని చెప్పారు.  


Similar News