Kolkata's RG Kar Hospital: ఆర్జీ కర్ మెడికల్ హాస్పిటల్ లో 10 మంది వైద్యులు సస్పెండ్

కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కు చెందిన పది మందిని వైద్యులను సస్పెండ్ చేస్తూ ఇంటర్నల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-06 09:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కు చెందిన పది మందిని వైద్యులను బహిష్కరిస్తూ ఇంటర్నల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. బెదిరింపులు, మనీలాండరింగ్, ర్యాగింగ్ ఆరోపణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆర్జీకర్ హాస్పిటల్ లో భయం, వేధింపుల వాతావరణాన్ని సృష్టించడం సహా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. డాక్టర్లను హాస్టల్ నుండి కూడా శాశ్వతంగా బహిష్కరించాలని, వారి ఇళ్లకు నోటీసులు కూడా పంపాలని నిర్ణయించింది. 10 మంది వైద్యుల బహిష్కరణతో పాటు, ఇంటర్న్‌లు, విద్యార్థులు, హౌస్ సిబ్బందితో సహా మొత్తం మరో 59 మంది వ్యక్తులను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

మాజీ ప్రిన్సిపల్ తో సంబంధాలు..!

సీబీఐ అరెస్టు చేసిన సౌరభ్ పాల్, ఆశిష్ పాండే సహా అభిషేక్ సేన్, ఆయుశ్రీ థాపా, నిర్జన్ బాగ్చీ, సరీఫ్ హసన్, నీలాగ్ని దేబ్నాథ్, అమరేంద్ర సింగ్, సత్పాల్ సింగ్, తన్వీర్ అహ్మద్ కాజీలు బహిష్కరించిన వారి లిస్ట్ లో ఉన్నారు. ఇకపోతే, వారందరూ హాస్టల్ ఖాళీ చేయడానికి హాస్పిటల్ అధికారులు 72 గంటల సమయం ఇచ్చారు. వారి పేర్లను పశ్చిమబెంగాల్ రాష్ట్ర వైద్య మండలికి పంపిస్తామని తెలిపారు. వారి మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను సమీక్షించడం లేదా రద్దు చేసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా నిందితులు ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో కూడా సంబంధం కలిగి ఉన్నారని తెలిపారు. జూనియర్ డాక్టర్ల నుండి అనేక ఫిర్యాదులను స్వీకరించిన తర్వాతే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. మొత్తం 59 మంది నిందితులను గుర్తించామని వెల్లడించారు. నిందితుల్లో 43 మందిని హాస్టల్ నుంచి బహిష్కరించారు. తదుపరి విచారణను కొనసాగించి, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ తెలిపింది.


Similar News