కర్ణాటకలో హంగ్ అంటున్న సర్వే సంస్థలు.. రంగంలోకి ప్రధాని మోడీ!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరం రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు వ్యవహారం సాగుతున్నది.
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరం రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు వ్యవహారం సాగుతున్నది. రాబోయే ఎన్నికల్లో హంగ్ తప్పదని, అధికార మార్పు తప్పదని పలు సర్వేలు చెబుతున్న వేళ కర్ణాటక ఎన్నికల రంగంలోకి నేరుగా ప్రధాని మోడీ దిగడం హాట్ టాపిక్‌గా మారింది. పలువురు అసంతృప్తులు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న వేళ.. టికెట్ కోల్పోయిన బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్పకు శుక్రవారం స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడటం సంచలనంగా మారింది. శివమొగ్గ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పని చేసిన ఈశ్వరప్ప ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ అతడికి బీజేపీ నాయకత్వం టికెట్ నిరాకరించింది.
ఈ క్రమంలో టికెట్ లభించని మిగతా బీజేపీ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న వేళ ఈశ్వరప్ప నిబద్దతను ప్రధాని మోడీ ఫోన్ కాల్‌లో అభినందించడం చర్చగా మారింది. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఈశ్వరప్ప మాట్లాడుతూ మీ లాంటి నాయకుడు తన లాంటి సాధారణ కార్యరక్తకు ఫోన్ చేసి పలకరించడం గొప్పగా అనిపించిందని, తన ప్రాంతంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా చూడాలని ప్రధానిని కోరారు. ఇదిలా టికెట్ లభించకపోవడంతో పలువురు సీనియర్ నేతలు బీజేపీని వీటి కాంగ్రెస్, జేడీఎస్ లో చేరారు.
ముఖ్యంగా మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది కమలం నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ పరిణామం కాంగ్రెస్ కు కలిసివచ్చేదిగా మారే అవకాశాలు ఉండటంతో నేరుగా రంగంలోకి దిగిన నరేంద్ర మోడీ.. అసంతృప్తులు పార్టీ మారకుండా ఉండేందుకే ఈశ్వరప్పతో మాట్లాడినట్లు టాక్ వినిపిస్తోంది. మరో వైపు ఇక్కడ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే 40 మదితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన బీజేపీ.. కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు ప్రధాని మోడీని ఎన్నికల ప్రచారానికి దింపబోతోంది. దాదాపుగా 20 చోట్ల భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనేలా కర్ణాటక బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న కర్ణాటక ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పెద్ద సవాలుగా మారింది.
#KarnatakaElections2023 | PM Modi held a telephonic conversation with Karnataka BJP leader and former minister KS Eshwarappa.
— ANI (@ANI) April 21, 2023
(Source: KS Eshwarappa) pic.twitter.com/DxUn5bTVU3