Bal Puraskar : 17 మందికి ‘పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు’.. ఏపీ బాలికకు అవార్డు
దిశ, నేషనల్ బ్యూరో : వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 17 మంది బాలలకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ల(PM Rashtriya Bal Puraskar)ను రాష్ట్రపతి(President) ద్రౌపది ముర్ము గురువారం ప్రదానం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 17 మంది బాలలకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ల(PM Rashtriya Bal Puraskar)ను రాష్ట్రపతి(President) ద్రౌపది ముర్ము గురువారం ప్రదానం చేశారు. ఈ పురస్కారాలను అందుకున్న వారిలో 10 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నారు. దేశంలోని 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా పురస్కార విజేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంభాషించారు. వారికి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జెస్సీ రాజ్‌కు క్రీడా విభాగంలో ఈ పురస్కారం దక్కింది. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సింధూర రాజాకు ఇన్నోవేషన్ విభాగంలో ఈ పురస్కారాన్ని(Bal Puraskar) ప్రదానం చేశారు. తమిళనాడుకు చెందిన జననే నారాయణన్(ఆర్ట్ అండ్ కల్చరల్ విభాగం), పంజాబ్‌కు చెందిన సాన్వీ సూద్ (స్పోర్ట్స్ విభాగం), జమ్మూకు చెందిన రిషీక్ కుమార్ (టెక్నాలజీ విభాగం)లకు కూడా ఈ పురస్కారాలు లభించాయి.
ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో కీయా హట్కర్‌కు, కశ్మీరీ సంగీతం విభాగంలో 12 ఏళ్ల అయాన్ సజ్జాద్‌కు (కశ్మీర్), సంస్కృత సాహిత్యం విభాగంలో 17 ఏళ్ల వ్యాస్ ఓం జిగ్నేష్, సాహసం కేటగిరీలో 9 ఏళ్ల సౌరవ్ కుమార్, 17 ఏళ్ల అయోనా థాపాకు పురస్కారాలు దక్కాయి. జూడో ప్లేయర్ హేంబటి నాగ్‌కు, చెస్ ప్లేయర్ అనీశ్ సర్కార్‌ను సైతం ఈ పురస్కారాలు వరించాయి. ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ.. ‘‘పదో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ కుమారుల సాహసం, త్యాగనిరతులను స్మరించుకుంటూ ఏటా వీర్ బాల్ దివస్‌ను నిర్వహిస్తుంటారు’’ అని చెప్పారు. ఈ పురస్కారాలు పొందిన విద్యార్థులందరికీ ఆమె అభినందనలు తెలిపారు. మరెంతో మంది విద్యార్థులకు ఈ పురస్కార గ్రహీతలు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. పిల్లల్లో దాగిన ట్యాలెంట్‌ను గుర్తించి వారిని ప్రోత్సహించడం అనేది దేశ సంప్రదాయంలో ఒక భాగమన్నారు.