ప్రాంకా? మర్డరా?.. షాపింగ్ మాల్ లో మహిళ మృతిపై అనుమానాలు
షాపింగ్ మాల్ లో మూడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి చెందిన ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: సరదాగా చేసిన ప్రాంక్ చర్య ఓ మహిళ నిండు ప్రాణం బలి తీసుకున్నది. స్నేహితుడి పనికి మూడంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడిపోయి ప్రాణాలు వదిలింది. ఈ షాకింగ్ ఘటన ముంబయిలో మంగళవారం చోటుచేసుకున్నది. ముంబయికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోంబివాలిలోని గ్లోబ్ స్టేట్ భవనంలో నాగినా దేవీ మంజీరామ్ అనే మహిళా క్లీనర్ గా పని చేస్తున్నది. నిన్న లాబీలోని బాల్కానీ గోడపై ఆమె కూర్చుని ఉంది. ఆ సమయంలో బంటీ అనే వ్యక్తి సరదాగా కిందకు నెట్టేస్తున్నట్లుగా ప్రాంక్ చేద్దామని ప్రయత్నించాడు. అయితే ఈ ఘటనలో దురదృష్టవశాత్తు నాగిని దేవీ పట్టు జారి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు విడిచింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది నిజంగానే ఫ్రాంకా? లేక ఆ మహిళను ఉద్దేశపూర్వకంగానే కిందకు తోసేశారా అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.