ప్రతిపక్ష కూటమికి ప్రధాని మోడీ కొత్త పేరు..

ప్రతిపక్ష నాయకులు ఏర్పాటు చేసిన కూటమికి ప్రధాని మోడీ కొత్త పేరు పెట్టారు.

Update: 2023-08-04 14:18 GMT

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకులు ఏర్పాటు చేసిన కూటమికి ప్రధాని మోడీ కొత్త పేరు పెట్టారు. అది ‘ఇండియా’ కాదని, ‘ఘమండియా‘ (పొగరుబోతు) కూటమి అని అభివర్ణించారు. పేదలకు వ్యతిరేకంగా వాళ్లు పన్నుతున్న కుట్రలను దాచేందుకు విపక్షాలు తమ కూటమి పేరును ‘యూపీఏ’ నుంచి ‘ఇండియా’గా మార్చుకున్నారని విమర్శించారు. కూటమికి ‘ఇండియా’ పేరును దేశభక్తిని చాటుకునేందుకు పెట్టుకోలేదని, దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతోనే పెట్టారని ఆరోపించారు. ఎంపీలు కుల రాజకీయాలకు అతీతంగా ఎదగాలని, మొత్తం సమాజానికి నాయకులుగా మారాలని ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోడీ సూచించారు. ఎన్డీయే త్యాగానికి నితీష్ కుమార్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు.

బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ మిత్రుడు నితీష్‌కు సీఎం పదవి ఇవ్వడం తమ పార్టీ చేసిన త్యాగంగా అభివర్ణించారు. సొంత ప్రయోజనాల కోసం ఎన్డీయేను విడిచి పెట్టిన మిత్రపక్షాలకు అకాలీదల్‌ను ఉదాహరణగా చూపించారు. ప్రభుత్వ పథకాలను ‘ఎన్డీయే ప్రభుత్వ పథకాలు’గా ప్రచారం చేయాలని, ఎన్డీయే మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ప్రజలకు చెప్పాలని ఎన్డీయే ఎంపీలకు సూచించారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో పోరాటం ఎన్డీయే-ఇండియాల మధ్య, ప్రధాని మోడీ-ఇండియా మధ్య, బీజేపీ సిద్ధాంతాలు-ఇండియా మధ్యే ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.


Similar News