'ఘర్షణలతో ఏ దేశానికీ ప్రయోజనం ఉండదు'.. ఇజ్రాయెల్‌ సంక్షోభంపై ప్రధాని మోడీ కీలక కామెంట్స్

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-10-13 11:41 GMT

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదాలు, ఘర్షణలతో ఏ దేశానికీ ప్రయోజనం ఉండదన్నారు. ‘‘శాంతి, సౌభ్రాతృత్వానికి ఇదే తగిన సమయం. మానవ అవసరాలను తీర్చే విధానాలతో కలిసికట్టుగా దేశాలన్నీ ముందుకు సాగాలి. ప్రపంచ దేశాలు పరస్పర విభేదాలతో ముక్కలైతే.. మానవాళి ముందున్న సవాళ్లకు పరిష్కారాన్ని చూపలేవు’’ అని మోడీ పేర్కొన్నారు. జీ20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల (పీ20) సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మోడీ.. 2001లో భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి ఘటనను గుర్తు చేశారు.

సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న భారత్‌.. ఇప్పటిదాకా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను కోల్పోయిందన్నారు. ‘‘ఉగ్రవాదం అనేది పెద్ద సవాల్‌ అనే విషయాన్ని ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోంది. ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా, అది మానవాళికి వ్యతిరేకం. యావత్‌ ప్రపంచం ఉగ్రవాదంతో అతలాకుతలమైనప్పటికీ, దాని ఏకరూప నిర్వచనంపై మాత్రం ఇప్పటికీ ఒప్పందం జరగకపోవడం శోచనీయం’’ అని ఆయన పేర్కొన్నారు.


Similar News