Delhi: కేజ్రీవాల్‌కు వసతి కల్పించాలని కేంద్రాన్ని కోరిన ఆప్ ఎంపీ

ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు వసతి కల్పించాలని ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రాన్ని కోరారు.

Update: 2024-09-20 13:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు వసతి కల్పించాలని ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రాన్ని కోరారు. దీనికి సంబంధించి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్నట్లు ఒక మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్‌ తన అధికారిక నివాసాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌గా, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు కేంద్రం వసతి కల్పించాలని రాఘవ్ చద్దా కోరారు.

ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి జాతీయ పార్టీకి ఢిల్లీ నుంచి పనిచేయడానికి రెండు నివాసాలు ఉంటాయి, ఒకటి దాని కార్యాలయం, ఇంకొటి పార్టీ అధినేతకు ఉండే మరో భవనం. 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆప్ జాతీయ పార్టీగా అవతరించింది, అందులో కొన్ని సీట్లు, మంచి ఓట్ల శాతం లభించాయి. బీజీపీకి చెందిన జెపి నడ్డా, కాంగ్రెస్‌కు చెందిన మల్లికార్జున్ ఖర్గే, బీఎస్‌పీకి చెందిన మాయావతి సహా దేశంలోని ఆరు జాతీయ పార్టీల అధ్యక్షులకు దేశ రాజధానిలో ప్రభుత్వం వసతి కల్పించింది, అదే విధంగా ఆలస్యం చేయకుండా నిబంధనలను అనుసరించి, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రభుత్వ వసతి కల్పించాలని నేను కేంద్రాన్ని కోరుతున్నాను, ఇది ఆయన, ఆమ్ ఆద్మీ పార్టీ హక్కు అని రాఘవ్ చద్దా అన్నారు.


Similar News