UPలో దారుణ ఘటన.. కదులుతున్న కారులో దళిత బాలికపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కదులుతున్న కారులో దళిత బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గురువారం చోటు చేసుకోగా, దీనిపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో ఘటన జరిగిన విషయం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే, యూపీలోని మథురలో గురువారం 13 ఏళ్ల దళిత మైనర్ బాలిక, కొన్ని సామాన్లు కొనడానికి ఇంటి దగ్గర ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లగా, అక్కడ నీరజ్ అనే వ్యక్తి మత్తు మందు కలిపిన వాటర్ బాటిల్‌ను ఇచ్చాడు. నీళ్లు తాగిన వెంటనే బాలిక స్పృహ తప్పి పడిపోయింది.
ఆ తర్వాత నీరజ్, అతని స్నేహితుడు శైలేంద్ర, మరో వ్యక్తి ఆ బాలికను కారులో తీసుకెళ్లి, పూర్తిగా స్పృహలో లేని ఆమెపై కదులుతున్న కారులో అత్యాచారం చేసి, బర్సానా రోడ్ ఫ్లైఓవర్ కింద పడేసి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత బాలిక స్పృహ లోకి రావడంతో ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ దారుణ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
స్థానిక ఎస్పీ త్రిగుణ్ బిసెన్ మాట్లాడుతూ, బాలిక పరిస్థితి క్షీణించింది. ఘటన జరిగిన తర్వాత బాలికను కుటుంబ సభ్యులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు, ఆమె అత్యాచారానికి గురైనట్లు ధ్రువీకరించడంతో బాలిక తల్లిదండ్రులు ఛటా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైన వెంటనే మేజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని, దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.