రాహుల్, కేజ్రీవాల్‌లకు పాక్ మద్దతుపై దర్యాప్తు ! : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లకు మద్దతుగా పాకిస్తాన్ రాజకీయ నాయకులు ప్రకటనలు చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఘాటుగా స్పందించారు.
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లకు మద్దతుగా పాకిస్తాన్ రాజకీయ నాయకులు ప్రకటనలు చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఘాటుగా స్పందించారు. మన దేశంలోని కొందరు నాయకులకు మద్దతుగా శత్రు దేశం పాకిస్తాన్‌లోని నాయకులు మాట్లాడుతుండటం తీవ్రమైన అంశమేనని, దానిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘మనదేశంతో శత్రుత్వం కలిగిన పాక్ నేతలు.. అతికొద్ది మంది భారతీయ నేతలను మాత్రమే ఎందుకు ఇష్టపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు’’ అని ప్రధాని పేర్కొన్నారు. భారత ఓటర్లకు చాలా పరిపక్వత ఉందని.. సరిహద్దు అవతలి నుంచి వచ్చే రాజకీయ ప్రకటనలు మనదేశంలో జరిగే ఎన్నికలను ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఈ కామెంట్స్ చేశారు.
పాక్ మాజీ కేంద్రమంత్రి ట్వీట్లతో దుమారం..
పాక్ మాజీ కేంద్ర మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ ఇటీవల రాహుల్ గాంధీకి చెందిన ఓ వీడియోను షేర్ చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంపై చౌదరి ఫవాద్ హుస్సేన్ ఓ ట్వీట్ చేస్తూ.. ‘‘మోడీజీ మరో యుద్ధంలో ఓడిపోయారు. జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల మితవాద భారతదేశానికి శుభవార్త’’ అని కామెంట్ చేశారు. ఇక ఇటీవల ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా ఓటు వేసిన ఫొటోను ట్యాగ్ చేస్తూ చౌదరి ఫవాద్ హుస్సేన్ మరో ట్వీట్ చేశారు. ‘‘శాంతి, సామరస్యంతో కలిసి ద్వేషం, తీవ్రవాద శక్తులను ఓడించాలి’’ అని చౌదరి ఫవాద్ కామెంట్ చేశారు. అయితే దీనికి కేజ్రీవాల్ బలమైన కౌంటర్ ఇచ్చారు. ‘‘చౌదరి సాహిబ్.. నేను, నా దేశ ప్రజలు మా సమస్యలను మేమే పరిష్కరించుకోగలుగుతాం. మీ ట్వీట్ల సాయం మాకు అక్కర్లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ భయంకరమైన స్థితిలో ఉంది. మీ దేశం సంగతి మీరు చూసుకోండి’’ అని కేజ్రీవాల్ గట్టి సమాధానమిచ్చారు.