Pm modi: ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అవసరం.. ప్రధాని మోడీ

ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. పోలాండ్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం వార్సాలో ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో సమావేశమయ్యారు.

Update: 2024-08-22 10:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. పోలాండ్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం వార్సాలో ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్, పోలాండ్‌లు అంతర్జాతీయ వేదికపై సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు.సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని ఇద్దరూ అంగీకరించినట్టు వెల్లడించారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు.

యుద్ధభూమిలో ఏ సమస్యనూ పరిష్కరించలేమని భారత్ ఈ విషయాన్ని ధృడంగా విశ్వసిస్తోందని చెప్పారు. ఏదైనా సంక్షోభంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మొత్తం మానవాళికి అతిపెద్ద సవాలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి, స్థిరత్వం ముందస్తు పునరుద్ధరణ కోసం చర్చలు, దౌత్యానికే ప్రాధాన్యత ఇస్తామని నొక్కి చెప్పారు. పోలండ్ పర్యటన అనంతరం మోడీ గురువారం ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడిన తర్వాత ఉక్రెయిన్‌లో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోడీనే కావడం గమనార్హం. రష్యాతో చారిత్రక స్నేహ సంబంధాలను కలిగి ఉన్నప్పటికీ యుద్ధంపై భారత్ తటస్థ వైఖరిని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News