కాంగ్రెస్ మీ ఇళ్లు, ఆభరణాలను లాక్కుంటుంది : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ తన ప్రసంగాల్లో పదునును మరింత పెంచారు.
దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ తన ప్రసంగాల్లో పదునును మరింత పెంచారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ దేశ ప్రజల ఆస్తులపై కన్నేసింది. వాటిని దోచుకోవాలనే ప్లాన్‌తో ఆ పార్టీ ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ ప్రమాదకరమైన ఎజెండా దాగి ఉంది’’ అని మోడీ ఆరోపించారు. ‘‘ఒకటికి మించి ఇళ్లు ఉన్నవాళ్ల దగ్గరి నుంచి ఇళ్లను లాక్కొని వేరే వాళ్లకు పంచాలనే ప్లాన్‌తో కాంగ్రెస్ పార్టీ ఉంది. అచ్చం మావోయిస్టులలా పనిచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది’’ అని మోడీ కామెంట్ చేశారు. కమ్యూనిస్టు భావజాలాన్ని పాటించిన చాలా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు పేకమేడల్లా కూలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ‘‘ఎన్నికల్లో గెలిస్తే చట్టాలను మార్చేసి దేశంలోని మహిళల ఆభరణాలను లాక్కోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ప్రతినెలా శాలరీ పొందే వ్యక్తులు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఎంత డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు ? వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయి ? ఎంత భూమి ఉంది ? అనే దానిపై కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించి ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది’’ అని ప్రధాని మోడీ చెప్పారు. దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల గణన చేయిస్తామనే కాంగ్రెస్ పార్టీ హామీ వెనుక దేశ ప్రజలకు నష్టం కలిగించే ప్రమాదకర ఆలోచనలు దాగి ఉన్నాయని ఆయన ఆరోపించారు.