PM Modi : ఆహార మిగులును సాధించిన దేశం భారత్ : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : ఆహార మిగులును సాధించిన దేశంగా భారత్ అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఆహార మిగులును సాధించిన దేశంగా భారత్ అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఇప్పుడు ప్రపంచ ఆహార భద్రతకు సహకరించేందుకు భారత్ తనవంతు ప్రయత్నాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో 32వ ‘వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సు’ (ఐసీఏఈ)ను ప్రధాని మోడీ ప్రారంభించి ప్రసంగించారు. ఈ సదస్సు భారత్‌లో జరుగుతుండటం 65 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. ఇదే విషయాన్ని ప్రధాని గుర్తు చేస్తూ.. ‘‘మా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చాం. అప్పట్లో మా దేశ వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. వాటన్నింటిని అధిగమించి ఆహార మిగులును సాధించే స్థితికి భారత్ ఎదిగింది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఒకప్పుడు భారత్‌లో ఆహారభద్రత గురించి యావత్ ప్రపంచం ఆందోళన చెందేది. ఇప్పుడు ప్రపంచ ఆహార అవసరాలను తీర్చే స్థాయికి భారత్ పురోగమించింది’’ అని మోడీ తెలిపారు. ప్రస్తుతం పాలు, పప్పుదినుసులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో భారత్ ఉందన్నారు. ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, తేయాకు పంటల్లో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించిందని పేర్కొన్నారు.
సుస్థిర వ్యవసాయానికి ప్రాధాన్యం..
ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే 1,900 కొత్త వంగడాలను గత పదేళ్లలో భారత వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని ప్రధాని తెలిపారు. రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని భారత్ ప్రోత్సహిస్తోందన్నారు. ఇటీవల భారత్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ సుస్థిర వ్యవసాయానికి పెద్దపీట వేసిన విషయాన్ని మోడీ గుర్తుచేశారు. భారత్ ఆర్థిక విధానాలకు వ్యవసాయ రంగమే కేంద్ర బిందువు అని చెప్పారు. ఈనెల 7 వరకు ఢిల్లీలో జరగనున్న ఐసీఏఈ సదస్సులో 70 దేశాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ‘‘సుస్థిర వ్యవసాయ - ఆహార వ్యవస్థల దిశగా పరిణామం’’ అనే థీమ్‌తో ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తున్నారు.