రాష్ట్రం కాలిపోతున్నా నోరు విప్పని ప్రధాని : Sharad Pawar

జాతుల మధ్య విద్వేషంతో రగిలిపోతున్న మణిపూర్‌కు ప్రధాని మోడీ వెళ్లాల్సి ఉండేదని, మణిపూర్ మహిళల బాధ ఆయనకు అర్ధం కాదని వెటరన్ రాజకీయ నాయకుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.

Update: 2023-08-17 14:18 GMT

ముంబై: జాతుల మధ్య విద్వేషంతో రగిలిపోతున్న మణిపూర్‌కు ప్రధాని మోడీ వెళ్లాల్సి ఉండేదని, మణిపూర్ మహిళల బాధ ఆయనకు అర్ధం కాదని వెటరన్ రాజకీయ నాయకుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. అలా చేయకపోగా.. పార్లమెంట్ సమావేశానికి ముందు 3 నిమిషాలు, అవిశ్వాస తీర్మానంలో 5 నిమిషాలు మాత్రమే మణిపూర్ హింసాకాండపై మాట్లాడారని విమర్శించారు. మహారాష్ట్రలోని బీడు పట్టణంలో గురువారం ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై, మహారాష్ట్రలోని బీజేపీ, ఏక్‌నాథ్ షిండేల కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

జాతి హింస చెలరేగిన మణిపూర్‌లో రెండు వర్గాల ప్రజలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారని, గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లను తగుల బెడుతున్నారని, మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్నారని.. ఇంత మారణకాండ జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమైందన్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విపక్షాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్ పవార్ వర్గం కూడా ఉంది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మే 3వ తేదీన హింస చెలరేగినప్పటి నుంచి అక్కడి పరిస్థితి గురించి ప్రధాని మోడీ రెండుసార్లు మాత్రమే మాట్లాడారు.


Similar News