బెంగాల్‌లో అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
పండుగ సీజన్‌లో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కొందరు దుండగులు ప్లాన్ చేస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: రాబోయే దీపావళి పండుగ సీజన్‌లో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కొందరు దుండగులు ప్లాన్ చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha benarjee) ఆరోపించారు. భద్రతా ఏర్పాట్లను పెంచాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. దీపావళి(Diwali) కాళీ పూజ(kali puja), ఛత్ పూజ( Chhath Puja) వేడుకల సందర్భంగా మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసులు నిఘా పెంచాలని కోరారు.
‘బెంగాల్‌లో మతపరమైన ఉద్రిక్తతలు కోరుకోవడం లేదు. రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే అల్లర్లను ప్రేరేపించే వారిని ఎక్కువగా చూపెట్టొద్దు’ అని మీడియాకు విజ్ఞప్తి చేశారు. దానా తుఫాన్‌పై సైతం మమతా బెనర్జీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దానా తుపాన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకరు మరణించినట్టు తెలిపారు. సుమారు 2.16 లక్షల మందిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు. తుపాన్ వల్ల ప్రభావితమైన ప్రజలందరికీ సహాయక సామగ్రి చేరేలా చూడాలని అధికారులకు ఆర్డర్స్ జారీ చేశారు. కాగా, ఇటీవల తీరం ధాటిన దానా తుపాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే.