Currency Notes Scam: అక్రమంగా రూ. 2,000 నోట్ల మార్పిడి.. స్కామ్ సూత్రధారి 'పల్లీ వ్యాపారి'
అతనితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఆర్‌బీఐ చెలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ. 2,000 నోట్లను అక్రమంగా మార్పిడి చేస్తున్న ఓ వ్యక్తిని నాగ్‌పూర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ నోట్ల మార్పిడి స్కామ్‌కు సూత్రధారి ఓ పల్లీ వ్యాపారి అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. అతనితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఒకరైన నందలాల్ మౌర్య భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కార్యాలయం, మహారాష్ట్ర విధాన్ భవన్ ఉన్న సంవిధాన్ స్క్వేర్ ప్రాంతంలో బండి మీద పల్లీలు, చిరుతిళ్లను విక్రయిస్తాడు. ఆర్‌బీఐ పెద్ద నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకున్న తర్వాత ఆర్‌బీఐ ఆఫీసుల్లో మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకున్న అతను వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుంచి రూ. 2000 నోట్లను తీసుకుని స్థానికంగా ఉండే పేదలకు కొంత ముట్టజెప్పి రూ. 5000 కరెన్సీ నోట్ల మార్పిడికి నియమించుకున్నాడు. ఒక్కో నోటు మార్పిడికి రూ. 200 కమిషన్ ఇచ్చేలా మాట్లాడుకున్నాడు. వారి నుంచి ఆధార్ కార్డు వివరాలను తీసుకుని నోట్ల మార్పిడి చేయడం ప్రారంభించాడని ఓ అధికారి తెలిపారు. పక్కా సమాచారం తెలుసుకున్న అధికారులు అతనితో పాటు రోహిత్ బావ్నె, కిషోర్ బహోరియా, అనిల్ జైన్‌లను పట్టుకున్నారు. నందలాల్ మౌర్య నుంచి రూ. 500 విలువైన 120 నోట్లతో పాటు రూ. 60,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రోహిత్ వద్ద 120 రూ. 2000, రూ. 500 నోట్లు, రూ. 62,500, కిషోర్ వద్ద రూ. 500 విలువైన 160 నోట్లతో పాటు రూ. 80,000 గుర్తించారు.