Prison Manual: జైలులో కుల వివక్ష సమస్య పరిష్కరించాలి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
జైలు మాన్యువల్‌లో వివక్షను కొనసాగించే నిబంధనలు సవరించాలని గతేడాది అక్టోబర్ 3న సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: జైలు మాన్యువల్‌లో వివక్షను కొనసాగించే నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, మూడు నెలల్లోగా ఈ నిబంధనలు సవరించాలని గతేడాది అక్టోబర్ 3న కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (Supreme court) ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. జైళ్లలో ఖైదీలను కులం ఆధారంగా వర్గీకరించడం, దీనిపై తనిఖీ చేయడానికి హోం మంత్రిత్వ శాఖ జైలు మాన్యువల్‌ను సవరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు(States), కేంద్రపాలిత ప్రాంతాలకు గురువారం లేఖ రాసింది. ‘మోడల్ ప్రిజన్ మాన్యువల్- 2016, మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్, 2023’లో మార్పులు చేసినట్టు తెలిపింది. నూతన మ్యాన్సువల్ ప్రకారం.. ఖైదీల కులం ఆధారంగా ఎలాంటి వివక్ష, వర్గీకరణ, విభజన లేదని జైలు అధికారులు ఖచ్చితంగా నిర్ధారించాల్సి ఉంటుంది. ఖైదీలకు వారి కుల ప్రాతిపదికన జైళ్లలో ఏదైనా పని కేటాయింపులో వివక్ష ఉండొద్దని ధ్రువీకరించాలి. మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్, 2023లో కుల ఆధారిత వివక్ష నిషేధం అనే కొత్త శీర్షికతో సెక్షన్ 55(A)లో మార్పులు చేసినట్టు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.